: టీడీపీలో చేరనున్న సినీ నటి వాణీవిశ్వనాథ్!
నాటి సినీ నటి వాణీవిశ్వనాథ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేతలు ఆనం శ్రీహరినాయుడు, దూర్వాసులు నాయుడు, హరినాయుడు తదితరులు నిన్న చెన్నై వెళ్లి ఆమెను కలిశారు. టీడీపీలో చేరాలని వారు కోరగా, అందుకు ఆమె అంగీకరించారు. ఈ సందర్భంగా వాణీవిశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ, పలు తెలుగు సినిమాల్లో తాను నటించానని, తన అభివృద్ధికి కారకులైన తెలుగువారి కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని అన్నారు.
అంతేకాకుండా, సీఎం చంద్రబాబు నాయకత్వమంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. యావత్తు దక్షిణ భారతదేశం చంద్రబాబు నాయకత్వం గురించి, ఆయన విజన్ గురించి చర్చించుకుంటోందని చెప్పిన ఆమె, త్వరలోనే ఏపీ రాజధాని అమరావతికి వెళ్లి టీడీపీలో చేరతానని చెప్పారు. కాగా, దక్షిణాది నటి వాణీ విశ్వనాథ్ పలు మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. తాజాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రంలో వాణీ విశ్వనాథ్ నటించారు.