: గుర్మీత్ ను బయటకు తెచ్చేది లేదు... జైల్లోకే తరలిన సీబీఐ స్పెషల్ కోర్టు!


రేపు డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ కు అత్యాచారం కేసులో శిక్ష ఖరారు చేయనుండగా, ఆయన్ను కోర్టుకు తరలించే నిమిత్తం బయటకు తెస్తే, మరింత విధ్వంసం జరగవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికతో అప్రమత్తమైన హర్యానా ప్రభుత్వం, ఆయన ప్రస్తుతం ఉన్న రోహ్ తక్ జైల్లోకే కోర్టును తరలించాలని నిర్ణయించింది. రోహ్ తక్ జైలులోనే సీబీఐ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి, గుర్మీత్ ను అక్కడే హాజరు పరచి తీర్పును వెలువరించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇందుకోసం జైల్లోని ఓ బ్యాకర్ ను ఖాళీ చేయించిన అధికారులు, కోర్టును ఏర్పాటు చేస్తున్నారు.

 రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య తీర్పు విడుదల కానుండగా, పంచశిల, సిర్సా ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఇతర ప్రాంతాల్లో 144 సెక్షన్ లు అమలవుతున్నాయి. రేప్ కేసులో దోషిగా తేలిన ఆయన 7 నుంచి 10 సంవత్సరాల శిక్షను ఎదుర్కోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆపై ఆయన పై కోర్టులో అపీలు చేసుకునే అవకాశాన్ని కూడా న్యాయమూర్తి ఇస్తారని, అయితే, వెంటనే బెయిల్ లభించే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తోంది. కాగా, గుర్మీత్ తనపై అత్యాచారం చేశారని చెబుతున్న యువతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News