: మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా?: మహేశ్ కత్తిని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
‘మా అభిమాన నటుడిపై విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా?’ అని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తిని సినీ నటుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారంటూ మహేశ్ కత్తి ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ కత్తితో ఫోన్ ద్వారా మాట్లాడిన పవన్ కల్యాణ్ అభిమానులు తాము ఎంతో సహనంగా ఉంటామని, తాము దిగజారి ఉంటే ఇప్పుడు మహేశ్ కత్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలియదని అన్నారు.
కత్తి అంటే అన్ని కూరగాయలు తరుగుతుందని, ఒక్క ఉల్లిపాయనే తరగాలని చూస్తే కళ్లల్లో నీళ్లు వస్తాయని వారు వర్ణించారు. మహేశ్ కత్తి ఒక్క పవన్ కల్యాణ్ ని మాత్రమే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. దీంతో సమాధానం చెప్పిన మహేశ్ కత్తి.. తనను కొడతాను, చంపేస్తాను అని బెదిరించడంతోనే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అభిమానుల స్థాయి ఎటువంటిదో అర్థమయిపోతుందని వ్యాఖ్యానించాడు. ‘మన దేవుడిని విమర్శిస్తున్నాడు, వీడి సంగతి చూడండ’ని పవన్ కల్యాణ్ అభిమానులు వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టుకుంటున్నారని అన్నాడు. తాను కూడా జర్నలిజం చదువుకున్నానని, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో తనకు తెలుసని అన్నాడు.