: రాజకీయ అవసరాల కోసం పంచకులను తగులబెడుతున్నారు: హర్యానా ప్రభుత్వంపై హైకోర్టు వ్యాఖ్య
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టు కారణంగా పంచకులలో జరుగుతున్న హింసాకాండపై హర్యానా ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కడిగేసింది. రాజకీయ లబ్ధి కోసమే పంచకులను తగులబెడుతున్నారని ఆరోపించింది. హింసాకాండ వల్ల ప్రభుత్వానికి ఏం లాభమని ప్రశ్నించింది. కోర్టు ప్రాంగణంలోకి అంత మందిని, అన్ని కార్లను ఎందుకు అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబాకు దాసోహమై హింసకు మద్దతు పలుకుతున్నారా? అంటూ ప్రభుత్వాన్ని అడిగింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం గుర్మీత్ సింగ్ అనుచరులపై కేసులు నమోదు చేసింది. కోర్టు తీర్పు తర్వాత ఐపీఎస్ అధికారిపై చేయి చేసుకున్న 8 మందిపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా హింసను కట్టడి చేయడంలో విఫలమైనందుకు మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అయితే దీనిపై అధికార బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. హింస గురించి తమకు కూడా బాధగానే ఉన్నా, ఖట్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని మద్దతు పలుకుతున్నారు.