: కాకినాడ వాసులను చంద్రబాబు స్మార్ట్ గా మోసం చేస్తున్నారు!: వైసీపీ ఎమ్మెల్యే రోజా


ఏపీలో ఎప్పుడు, ఏ ఎన్నిక వచ్చినా వైసీపీ వైపే ఓటర్లు ఉంటారని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. 2014లో టీడీపీకి ఓటు వేయడం ద్వారా చేసిన తప్పును మళ్లీ చేయకూడదనే ఆలోచనలో ఓటర్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ఏదో చేస్తారనే ఆశతో ప్రజలు ఆయనకు ఓటు వేశారని... కానీ, ఈ మూడున్నరేళ్లలో ఇసుక నుంచి రాజధాని భూముల వరకు దోచుకోవడమే చంద్రబాబు పనిగా మారిందనే విషయం అందరికీ అర్థమయిందని అన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న రోజా...  మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాకినాడను స్మార్ట్ సిటీగా ఎంపిక చేశారని... రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు ఉపయోగించకపోయినా, కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వాడక పోవడం దారుణమని రోజా అన్నారు. కోర్టు మొట్టికాయలు వేసేంతవరకు కూడా కాకినాడ ఎన్నికలను పెట్టలేకపోయిన దద్దమ్మలు టీడీపీవారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకినాడ వీధుల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. స్మార్ట్ సిటీ అని చెబుతూ కాకినాడ వాసులను చంద్రబాబు స్మార్ట్ గా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News