: హర్యానాలో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్!
అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దోషి అని సీబీఐ కోర్టు ప్రకటించిన నేపథ్యంలో హర్యానాలోని పంచకులలో హింస చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలు జరుగుతాయని ఊహించినప్పటికీ అల్లర్లను అదుపు చేయలేకపోవడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
కాగా, సీఎం ఖట్టర్ పంచకులకు చేరుకున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర డీజీపీ ఇప్పటివరకు తాము 1000 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలపై కేంద్ర హోం శాఖమంత్రి నివాసంలో రేపు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొంటారు.