: `అర్జున అవార్డు` జాబితా విషయంలో క్రీడా మంత్రిత్వ శాఖపై హైకోర్టులో పిటిషన్ వేసిన వెయిట్ లిఫ్టర్
అర్జున అవార్డులు ఇవ్వడంలో తనను నిర్లక్ష్యం చేశారని 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ 48కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంజితా చాను ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా ఆమె ఈ పిటిషన్ వేశారు. అర్జున అవార్డు పొందడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నా రెండేళ్లుగా క్రీడా మంత్రిత్వ శాఖ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అవార్డుకు ఎంపికైన వారి కంటే తాను ఉత్తమ ప్రతిభాపాటవాలు కనబరిచినట్లు సంజిత తెలిపారు.
`అర్జున అవార్డును క్రీడాకారులు సాధించిన పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ లెక్క ప్రకారం సంజితకు 45 పాయింట్లు ఉన్నాయి. 2014లో బంగారు పతకానికి 30, 2015లో కామన్వెల్త్ సీనియర్ విమెన్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకానికి 15 పాయింట్లు ఆమె సాధించారు. సంజిత కంటే తక్కువ పాయింట్లు ఉన్న అర్జున అవార్డు ఇచ్చారు` అని ఆమె తరఫు న్యాయవాది హేమంత్ రాజ్ ఫాల్పర్ చెప్పారు. గతంలో కూడా అర్జున అవార్డు విషయంలో బాక్సర్ మనోజ్ కుమార్, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అతనికి తర్వాత అవార్డు లభించిన సంగతి విదితమే.