: సుప్రీం తీర్పిచ్చి 24 గంటలైనా గడవక ముందే.. తలాక్ చెప్పిన భర్త.. గర్భస్రావంతో బాధపడుతున్నా కనికరం చూపని వైనం!
ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం తీర్పు వెలువరించి 24 గంటలైనా గడవకముందే ఓ భర్త తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చేశాడు. ఉత్తరప్రదేశ్, మీరట్‌లోని మొహల్లా కమ్రా నవాబన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. స్థానికంగా నివాసముంటున్న మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ప్రస్తుతం మరోమారు గర్భంతో ఉన్న ఆమెపై భర్త చేయిచేసుకున్నాడు.
ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా వారొచ్చి అతడిని నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. తలాక్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని అతడి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గర్భంతో ఉన్న భార్యపై దాడి చేయడంతో ఆమె గర్భస్రావంతో బాధపడుతోంది. ఈ విషయం తెలిసి కూడా అతడు నిర్దాక్షిణ్యంగా తలాక్ చెప్పడంపై పలువురు మండిపడుతున్నారు.