: బంగారు బిస్కెట్లను అరటి పండులో పెట్టుకుని మింగేసి తరలించబోయిన యువకుడు!
ఏడు బంగారు బిస్కెట్లను అరటి పండులో పెట్టుకుని మింగేసి వాటిని అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఓ యువకుడిని తిరుచ్చిలోని ఎయిర్‌పోర్టు సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడిని అధికారులు ఆసుపత్రికి తరలించి, ఆ బిస్కెట్లను బయటకు తీయించారు. అతడు ఎయిర్ ఏసియా విమానంలో మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి ఇక్కడకు వచ్చాడని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
తాము ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే, అతడిపై కేసు నమోదు చేయించి, కోర్టులో హాజరుపర్చామని అన్నారు. వైద్యులు అతడి కడుపులో ఉన్న బిస్కెట్లన్నింటినీ బయటకు తీశారని తెలిపారు. ఆ ఏడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.5 లక్షల 96 వేలు ఉంటుందని చెప్పారు. సదరు నిందితుడు తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మహ్మద్ ముస్తఫా సలీం అని వివరించారు.