: బ్యాంకు నుంచి కేవలం చిల్లర నాణేలను మాత్రమే దోచుకున్న దొంగలు... ఎందుకో తెలుసా?
ఉత్తర ఢిల్లీలో ముఖర్జీ నగర్‌లోని సిండికేట్ బ్యాంకులో రూ. 2.3 లక్షల నగదును సోమవారం రాత్రి ముగ్గురు దొంగలు దోచుకున్నారు. వారు కేవలం అంత మొత్తాన్ని రూ. 5, రూ. 10 నాణేల రూపంలోనే దొంగతనం చేశారు. ఈ మొత్తాన్ని వారు 46 సంచుల్లో నింపుకుని పారిపోయారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దొంగల్ని బ్యాంకు దగ్గరలోని డిపోలో పనిచేసే వ్యక్తులుగా గుర్తించి ఢిల్లీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. తర్వాత విచారణలో తాము నాణేల రూపంలోనే ఎందుకు దొంగతనం చేశామనే విషయాన్ని వాళ్లు బయటపెట్టారు. అది విని పోలీసులు నవ్వుకున్నారు. ఇంతకీ అదేంటో తెలుసా!
పెద్ద నోట్లు రద్దై కొత్త రూ. 2000, రూ. 500 నోట్లు అమల్లోకి వచ్చినపుడు వాటిలో చిప్ సాంకేతికత ఉంటుంది, దాని వల్ల ఆ నోటు ఎక్కడుందన్న విషయం తెలిసిపోతుందనే పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి చిప్‌లు ఏం లేవని ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. కానీ ఆ దొంగలకు ఈ విషయం తెలియక, నిజంగానే చిప్‌లు ఉంటాయనుకొని పెద్ద నోట్లు దొంగతనం చేయలేదట. అంతేకాకుండా వాటిని దొంగతనం చేసి, ఖర్చుపెడుతుంటే అనుమానం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో వారు కేవలం నాణేలను మాత్రమే దోచుకున్నట్లు వాళ్లు చెప్పారు.