: రూ. 3 విలువ గల సామాగ్రి దొంగతనం... 156 ఏళ్ల క్రితం ఢిల్లీ పోలీస్ స్టేషన్లో నమోదైన మొదటి ఎఫ్ఐఆర్ ఇదే!
19వ శతాబ్దంలో ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో నమోదైన మొదటి కేసు వంట పాత్రలు, హుక్కా దొంగతనానికి సంబంధించినది. దీని మీద 1861 అక్టోబర్ 18న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విషయానికి సంబంధించిన ఫొటోను ఢిల్లీ పోలీసు శాఖ తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. `ఢిల్లీ పోలీసు చరిత్రలో కొన్ని అరుదైన జ్ఞాపకాలు` అంటూ ఎఫ్ఐఆర్ ఫొటోను షేర్ చేసింది. ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి పోలీసు స్టేషన్లో 156 ఏళ్ల క్రితం ఈ కేసు నమోదైంది.
కత్రా శీశ్ మహల్ ప్రాంతానికి చెందిన మాయిద్దీన్ వాల్ద్ మహ్మద్ ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతను పోగొట్టుకున్న సామాగ్రి విలువ ఎంతో తెలుసా?.... 45 అణాలు ..అంటే దాదాపు రూ. 3. మరి ఆ కేసును పోలీసులు చేధించారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియదు. ఉర్దూలో రాసి ఉన్న ఈ ఎఫ్ఐఆర్ పత్రాన్ని ఢిల్లీ పోలీసు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.