: కత్తిపోట్లకు గురైన యువకుడు సహాయం కోసం అర్థిస్తుంటే.... అక్కడే నిలబడి వీడియో తీసిన జనాలు
మనుషులు ఎంత కర్కశంగా మారిపోయారో తెలియజేయడానికి ఈ సంఘటన చాలు. సెల్ఫీలు, వీడియోల పిచ్చితో సాటి మనిషికి సాయం చేయాలన్న ఇంగిత జ్ఞానాన్ని జనాలు కోల్పోతున్నారు. కత్తిపోట్లకు గురై నడిరోడ్డు మీద మంచినీళ్ల కోసం అర్థిస్తున్న యువకుడికి సాయం చేయకపోగా, తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. ఢిల్లీలోని విష్ణు గార్డెన్ ప్రాంతానికి చెందిన అక్బర్ అలీని ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు.
రక్తం చిందుతున్నా ఎలాగోలా కష్టపడి తన శరీరంలో దిగిన ఒక కత్తిని అక్బర్ బయటకు తీశాడు. రెండో కత్తిని తీయడానికి అతని చేయి సహకరించలేదు. దీంతో మంచినీళ్ల కోసం చుట్టూ ఉన్న వారిని ప్రాధేయపడ్డాడు. అతని బాధను వాళ్లెవరూ పట్టించుకోకుండా ఫోన్లలో వీడియోలు తీశారని అక్బర్ అలీ తమ్ముడు వాపోయాడు. తర్వాత ఓ మహిళ అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అతడు చెప్పాడు. అలీని పొడిచిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు.