: దినకరన్ కు చెక్ చెప్పే వ్యూహ రచనలో అన్నాడీఎంకే అధినాయకులు!
అన్నాడీఎంకే పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్న దినకరన్ కు చెక్ పెట్టే వ్యూహానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పదునుపెట్టారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో రిసార్టు రాజకీయానికి తెరతీసిన దినకరన్ ను కట్టడి చేసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దీనితోపాటే తమతో ఎవరెవరున్నారు? ఎవరెవరు అటువైపు వెళ్లే అవకాశం ఉంది? శశికళతో పాటు దినకరన్ ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తే తమకు వచ్చే నష్టం ఎంత? అనే అంశాలను కూడా బేరీజు వేయనున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ సీహెచ్.విద్యాసాగరరావు భేటీ కానున్నారు. తమిళనాడులో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఇతర పరిస్థితులపై వీరు చర్చించనున్నారు.