: రాజ్యసభలో వందను దాటిన ఎన్డీయే కూటమి బలం.. అయినా విపక్షాలదే పైచేయి!
రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం వంద సీట్ల మార్కును దాటింది. జేడీ (యూ) చేరిక, ఏఐఏడీఎంకే మద్దతుతో ఇది సాధ్యమైంది. మరోపక్క ఎన్డీయే వ్యతిరేక కూటమి మాత్రం 117 సీట్లతో ఇప్పటికీ రాజ్యసభలో పైచేయిగా ఉంది. రాజ్యసభలో మెజారిటీ సాధించాలంటే బీజేపీకి మొత్తం 123 సీట్లు అవసరం. యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో వచ్చే ఏడాది బీజేపీ 12కు పైగా స్ధానాలను గెలుపొందే అవకాశం ఉంది.
అలాగే గత రెండేళ్లలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదురవడంతో కాంగ్రెస్ బలం 65 నుంచి 57 సీట్లకు పడిపోయింది. ఇక ఏఐఏడీఎంకే మద్దతుతో రాజ్యసభలో ఎన్డీయే బలం 102కు పెరుగుతుంది. వీరిలో 57 మంది బీజేపీ, 10 మంది జేడీయూ, 13 మంది ఏఐఏడీఎంకే, ఆరుగురు టీడీపీ, శివసేన, అకాలీదళ్‌ల నుంచి ముగ్గురేసి సభ్యులు, ఇద్దరు పీడీపీ సభ్యులు, ఇతరులు నలుగురు సభ్యులున్నారు. వీరితో పాటు టీఆర్‌ఎస్, వైసీపీ, ఐఎన్‌ఎల్‌డీ సభ్యుల మద్దతు కూడా అప్పుడప్పుడు ఎన్డీయేకు లభిస్తున్న సంగతి తెలిసిందే.