: రిసార్టులో రాజభోగాలు అనుభవిస్తున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు!.. ఈ గూటికి చేరనున్న మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు?


అన్నాడీఎంకేపై తిరుగు'బావుటా' ఎగురవేసిన దినకరన్... తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించారు. ఈ ఎమ్మెల్యేలంతా రిసార్టులో రాజభోగాలు అనుభవిస్తున్నారు. రిసార్టులో ఉన్న మొత్తం 50 లగ్జరీ రూములను దినకరన్ బుక్ చేశారు. రిసార్టులో ఉన్న బాడీ మసాజ్ స్పా, భారీ స్విమ్మింగ్ పూల్, సువిశాలమైన గార్డెన్ లో ఎమ్మెల్యేలు సేదతీరుతున్నారు. ఖరీదైన మద్యంతోపాటు విదేశీ చేపలు, ఇతర సీ ఫుడ్స్ ను లాగించేస్తున్నారు. వీరు ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరినా... క్షణాల్లో అన్నీ వారి ముందుకు వస్తున్నాయి.

 కొందరు ఎమ్మెల్యేలు ఉదయాన్నే లేచి, సముద్ర తీరంలో జాగింగ్ చేశారు. గతంలో శశికళ తన ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్టులాగానే ఈ రిసార్టు కూడా శత్రు దుర్భేద్యంగా ఉంది. మూడు వైపులా సముద్రం ఉండటంతో... లోపలకు చొరబడటానికి ఎవరికీ అవకాశం లేదు. అయితే, ఈ క్యాంపును త్వరలోనే దినకరన్ బెంగళూరుకు తరలించనున్నట్టు కూడా సమాచారం. మరోవైపు, మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా దినకరన్ కు మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే, దినకరన్ కు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరుతుంది. 

  • Loading...

More Telugu News