: ఎన్నికలు ముగుస్తుండగా భూమా వర్గం దౌర్జన్యానికి దిగింది.. కచ్చితంగా మేమే గెలుస్తాం: శిల్పా మోహన్ రెడ్డి
ఈ రోజు నంద్యాల ఉప ఎన్నిక ముగుస్తుండగా భూమా వర్గం దౌర్జన్యానికి దిగిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలు ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనంతో ఉన్నామని అన్నారు. గొడవలు సృష్టించడం తప్పని తెలిసి కూడా టీడీపీ ఇటువంటి పనులు చేసిందని ఆరోపించారు. కేంద్ర బలగాలు, ఎన్నికల అధికారులు బాగా పనిచేశారని అన్నారు. నంద్యాలలో కచ్చితంగా తామే గెలుస్తామని శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ రోజు కూడా టీడీపీ నేతలు బెదిరించారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ ఎలా సంయమనంతో ఉంటారో చంద్రబాబు నాయుడు కూడా అలా నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. స్థానిక పోలీసులు టీడీపీకి అనుకూలంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు అభ్యంతరం చెప్పినందుకు తన తమ్ముడిని కూడా నిన్న రాత్రి నంద్యాల నుంచి పంపించానని అన్నారు. తాము న్యాయబద్ధంగా వ్యవహరించామని అన్నారు. ఓటమి భయంతో చివర్లో టీడీపీ దాడులకు దిగాలని చూసిందని చెప్పారు.