: అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న హీరోల జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేయగా, ముగ్గురు భారత నటులకు చోటు లభించింది. ఈ జాబితాలో ట్రాన్స్ ఫార్మర్ హీరో వార్క్ వాల్ బెర్గ్ తొలి స్థానంలో నిలిచాడు. అతని తాజా చిత్రం ఫ్లాప్ అయినా, రెమ్యునరేషన్ భారీగానే అందడంతో వాల్ బర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే జాబితాలో రూ. 243 కోట్ల (38 మిలియన్ డాలర్లు) సంపాదనతో షారుఖ్ ఖాన్ ఎనిమిదో స్థానంలో, రూ. 237 కోట్లు (37 మిలియన్ డాలర్లు) సంపాదనతో తొమ్మిదో స్థానంలో సల్మాన్ ఖాన్, రూ. 227 కోట్ల (35.5 మిలియన్ డాలర్లు) ఆదాయంతో అక్షయ్ కుమార్ పదవ స్థానంలో ఉన్నట్టు వెల్లడించారు.
ఈ జాబితాలో అమీర్ ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం. ఇక ఈ జాబితాలో ది రాక్ జాన్సన్ 65 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలువగా, విన్ డీసెల్, ఆడం సాండ్లర్, జాకీ చాన్ లు టాప్ 5లో ఉండగా, రాబర్ట్ టౌనీ జూనియర్, టాం క్రూస్ తదితరులకూ స్థానం లభించింది.