: డీమ్యాట్ ఖాతాదారులకు సెబీ హెచ్చరికలు.. ఆధార్ ఇవ్వకుంటే ఖాతా నిలిపివేస్తామంటున్న సెక్యూరిటీస్ బోర్డు!
డీమ్యాట్ ఖాతాదారులకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి బ్రోకర్లు, ఖాతాదారులు తమ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోకుంటే ఖాతాను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ విషయంలో ఏమైనా ఫిర్యాదులు ఉంటే నేడు (బుధవారం) సమర్పించాలని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇటీవల జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.
కొత్త ఖాతాదారులకు మాత్రం ఆధార్ అనుసంధానానికి ఆరు నెలల గడువు ఇచ్చింది. ఆధార్ సమర్పించని వారి ఖాతాలు తాత్కాలికంగా రద్దు చేస్తామని పేర్కొంది. ఒకరికి ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉండడం వల్లే సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల బ్లాక్ మనీని, తెల్లధనంగా మార్చుకోవడం కష్టమవుతుందని భావిస్తోంది.