: మీ పైసలతో సినిమా తీశారా? నచ్చకపోతే చూడకండి!: తమ్మారెడ్డి భరద్వాజ
విజయ్ దేవరకొండ, షాలిని జంటగా 'అర్జున్ రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులో జరిగింది. అయితే, ఈ సినిమా నిడివి మూడు గంటలు ఉండటంపై సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఎన్ని గంటలు సినిమా తీస్తే వాడికెందుకు? వాడేమైనా పైసలు పెట్టాడా? సినిమా అంటే వాడి అయ్య జాగీరా? ఎంతో నమ్మకంతో నిర్మాత, దర్శకుడు, హీరోలు సినిమా తీస్తారు. మూడు గంటలు తీస్తారు, 30 గంటలు తీస్తారు. నచ్చితే చూడు. లేకపోతే చూడొద్దు" అంటూ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ఇంకెవడో వస్తాడు. ముద్దు పెట్టుకున్న పోస్టర్లు ఏందయ్యా అని. ముద్దు పెట్టుకుంటే నీదేం పోయింది? నీవసలు థియేటర్ కే రావద్దు. పోనీ, మంచి సినిమా తీస్తే, వచ్చి చూస్తావా? ప్రతి ఒక్క విషయం వీళ్లకే కావాలి" అంటూ మండిపడ్డారు. సినిమాలో హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటున్న పోస్టర్లను వీహెచ్ చింపేసిన సంగతి తెలిసిందే.