: యుద్ధ విమానాలు, అత్యాధునిక ఆయుధాలతో డోక్లామ్ లో సత్తా చూపిస్తున్న చైనా!
డోక్లామ్ సెక్టార్ లో భారత్, చైనాల మధ్య సరిహద్దుల విషయమై వివాదం పెరిగి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వెస్ట్రన్ థియేటర్ ఆర్మీ లైవ్ డ్రిల్ ఎక్సర్ సైజులను చేపట్టి తన బలాన్ని ప్రదర్శిస్తోంది. చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్', ప్రభుత్వ రంగ చైనా సెంట్రల్ టెలివిజన్ లు ప్రచురించిన వార్తలు, చూపిన విజువల్స్ ప్రకారం, 10 పీఎల్ఏ యూనిట్ లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
యుద్ధ విమానాలు, సాయుధులైన జవాన్లు ఈ డ్రిల్స్ చేస్తున్నాయి. అయితే, ఈ విన్యాసాలు డోక్లామ్ కు ఎంత దూరంలో జరుగుతున్నాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఐదు నిమిషాల నిడివివున్న వీడియోలో భూమిపై ఉన్న టార్గెట్లను ఫైటర్ చాపర్లు పేల్చి వేస్తున్న దృశ్యాలున్నాయి. కాగా, డోక్లామ్ తమదేనని, ఇక్కడ భారత దళాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయని చైనా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గడచిన జూలైలోనూ పీఎల్ఏ సైన్యం ఇదే తరహా లైవ్ ఎక్సర్ సైజులను టిబెట్ సరిహద్దుల్లో చేపట్టింది.