: పన్నీరు, పళని రాజకీయాలు చూసి ప్రపంచం నవ్వుకుంటోంది: ఖుష్బూ
తమిళనాట చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలో తాజా పరిణామాలపై ఆమె మాట్లాడుతూ, తమిళ రాజకీయాలను చూసి ప్రపంచం నవ్వుతోందని అన్నారు. అన్నాడీఎంకే వర్గాల విలీనంలో ఆశ్చర్యపడాల్సిందేమీలేదని ఆమె అభిప్రాయపడ్డారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామికి వేరే అవకాశం లేక విలీనమయ్యారని తేల్చిచెప్పారు. అయితే నిన్నటి వరకు తిట్టుకుని ఇప్పుడెలా అకస్మాత్తుగా కలిశారు? అని ఆమె ప్రశ్నించారు. అంటే బేరం కుదిరిందా? అని ఆమె నిలదీశారు. ఈ విలీనం వల్ల ప్రజలకు ప్రయోజనమేంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వారి స్వలాభం కోసం వారు కలిశారని ఆమె అన్నారు.
నాలుగేళ్లు కుర్చీలో కూర్చోవడం ఎలా? సంపాదన వెనకేయడం ఎలా? అన్నదే వారి లక్ష్యమని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పుడు దినకరన్ వర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు? వారెలాంటి బేరసారాలకు దిగుతారన్నది గమనించాలని ఆమె సూచించారు. తమిళనాడులో అడుగు పెట్టేందుకు బీజేపీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్లే ఇలాంటి రాజకీయాల ద్వారా పాగా వేయాలని కుయుక్తులు పన్నుతోందని ఆమె విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రానికి బానిసగా ఇప్పటి ప్రభుత్వం ఉంటుందని ఆమె అన్నారు. బీజేపీ ఒత్తిడితోనే పన్నీరు, పళని వర్గాలు విలీనమయ్యాయని ఆయె స్పష్టం చేశారు. ఈ కలయికను తమిళ ప్రజలు ఆమోదించరని ఆమె తెలిపారు.