: జియోకు పోటీగా ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్... ఫీచర్ ఫోన్ తో పోలిస్తే బెటర్!
రిలయన్స్ జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్ కు పోటీగా రూ. 2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేనుంది. దీని కోసం మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలతో ఎయిర్ టెల్ జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ, ఈ ఫోన్ ను ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో తీసుకువస్తున్నట్టు ఎయిర్ టెల్ వర్గాలు వెల్లడించాయి.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అన్ని రకాల యాప్స్ నూ వాడుకోదగ్గ ఈ ఫోన్ దసరా, దీపావళి పండగ సీజన్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. జియో ఫీచర్ ఫోన్ తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం దీనికి ఉంటాయని టెలికం ఇండస్ట్రీ నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, డీల్ కుదిరిందా? లేదా? అన్న విషయాన్ని మాత్రం ఈ కంపెనీలు వెల్లడించలేదు. ఇక తమ కొత్త స్మార్ట్ ఫోన్ విషయమై ఎయిర్ టెల్ అధికారికంగా స్పందించాల్సి వుంది.