: రాయ్‌పూర్ లోని ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు చిన్నారుల మృతి
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు 100 మంది చిన్నారులు మృతి చెందిన దారుణ ఘటనను మరవకముందే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఇటువంటి ఘటనే మరొకటి జరిగింది. ఆ ప్రాంతంలోని అంబేద్కర్ ఆసుపత్రిలో నిన్న ఆక్సిజన్ అందక ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు... సదరు ఆస్పత్రి అటెండెంట్ రవిచంద్ర, మరో ఇద్దరు మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నారని గుర్తించారు. వారి నిర్లక్ష్యం వల్లే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ కేసులో రవిచంద్రను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనను ఆస్పత్రి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఆదేశించారు.