: హైదరాబాదులో థాయ్ మసాజ్ గుట్టు ఎలా రట్టైందంటే...!
హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరు మసాజ్ సెంటర్లపై పోలీసులు కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసాజ్ పేరుతో శృంగారకార్యకలాపాల్లో మునిగి ఉన్న పలువురిని అదుపులోకి తీసుకోగా, వారిలో 31 మంది విదేశాలకు చెందిన యువతులు ఉండడం విశేషం. ఇంతకీ ఈ ముఠా గుట్టు పోలీసులకు ఎలా చిక్కింది? గుట్టుచప్పుడు కాకుండా మసాజ్ సెంటర్ల రూపంలో ఉన్న వీటిపై దాడులకు కారణం కూకట్ పల్లికి చెందిన 24 ఏళ్ల యువకుడు కావడం విశేషం. యువకుడేదో సంఘ సంస్కరణకు నడుం బిగించాడని భావించకండి.
సదరు యువకుడు ఇటీవల ఇంట్లోంచి 5 లక్షల రూపాయలు దొంగిలించాడు. అయితే కుమారుడే దొంగతనం చేశాడని భావించి కుటుంబ సభ్యులు మందలించి ఊరుకున్నారు. అయితే ఆ యువకుడు ఈ మధ్య 2 లక్షల రూపాయలు మళ్లీ దొంగతనం చేసేందుకు ప్రయత్నించి కుటుంబ సభ్యులకు దొరికిపోయాడు. ఇంతలో హైదరాబాదును డ్రగ్స్ దందా కుదిపేసింది.
దీంతో ఇంత పెద్దమొత్తంలో డబ్బులు దేనికి అవసరమవుతున్నాయంటూ అతనిని నిలదీశారు. దీంతో మసాజ్ కు వెళ్తున్నానని తెలిపాడు. ఈ మేరకు వివరాలందించినా సంతృప్తి చెందిని కుటుంబ సభ్యులు, అతనిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆరాతీసిన పోలీసులకు థాయ్ మసాజ్ మాటున సాగే గుట్టుచప్పుడు కాని యవ్వారం బయటపడింది. దీంతో దాడులు చేసిన పోలీసులు వారి ఆటకట్టించారు.