: కేసీఆర్ మాటలతోనే కడుపు నిండిపోయింది: వెంకయ్యనాయుడి చమత్కారం
సన్మాన కార్యక్రమం తరువాత పసందైన విందు ఏర్పాటు చేస్తాను...మీరు తప్పకుండా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ మాటలతో తన కడుపు నిండిపోయిందని అన్నారు. తాను భాషా ప్రియుడ్ని, భోజన ప్రియుడ్ని కూడా అని ఆయన చెప్పారు. ఇక్కడి కొస్తే హైదరాబాదు బిర్యానీ అని, అటు వెళ్తే నెల్లూరు చేపల పులుసు అని అంటారని అన్నారు.
1978లో తాను ఎమ్మెల్యేగా తొలిసారి హైదరాబాదుకు వచ్చానని అన్నారు. తాను పుట్టింది నెల్లూరు జిల్లా అయితే చదివింది వైజాగ్ లో, ఇక రాజకీయంగా ఎదిగింది, ఒదిగింది హైదరాబాదులోనేనని ఆయన అన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాదు నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. దానికి చాలా మంది కారణం కావచ్చు అని అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనం తెలుగువారమేనని ఆయన చెప్పారు. మనల్ని ఇతరులెవరైనా తెలుగువారనే అంటారని ఆయన గుర్తు చేశారు. కనుక సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.