: బంగ్లాదేశ్ ప్రధాని హత్యకు కుట్ర.. పదిమందికి మరణశిక్ష
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హత్యకు కుట్ర పన్నిన పదిమంది తీవ్రవాదులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కుట్రలో భాగం పంచుకున్న మరో తొమ్మిదిమందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2000 సంవత్సరంలో హసీనా తన స్వగ్రామమైన నైరుతి గోపాల్ గంజ్‌లో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ర్యాలీలో శక్తిమంతమైన బాంబును అమర్చడం ద్వారా ప్రధానిని చంపాలని ఉగ్రవాదులు పథకం పన్నారు.
అయితే, ర్యాలీకి ముందు భద్రతా బలగాలు బాంబును గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఈ ఘటన వెనక ఇటీవల మరణశిక్షకు గురైన హర్కతుల్ జిహాద్-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్ చీఫ్ ముఫ్తీ హనన్ ఉన్నట్టు నిర్ధారించారు. ఈ కేసులో 25 మంది అరెస్ట్ కాగా, కోర్టు 9 మందికి 20 ఏళ్లు జైలు శిక్ష, 20 వేల టాకాల జరిమానా విధించింది. మిగతా వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఇక పది మంది దోషులను ఉరితీయడం ద్వారా కానీ, కాల్చి చంపడం ద్వారా కానీ మరణశిక్షను అమలు చేయాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.