: కోర్టు వాయిదాకు వచ్చిన బాధితురాలిపై నిందితుడి అత్యాచారం!
కోర్టు వాయిదాకు వచ్చి, మాట్లాడాలని చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...బోడుప్పల్ లోని హేమానగర్ కు చెందిన యువతి (30), కామారెడ్డి జిల్లాకు చెందిన ఇర్ఫాన్ (35) లు హైదరాబాదులోని జెన్ ప్యాక్ట్ లో సహోద్యోగులు. వీరిద్దరూ ప్రేమ పేరుతో కొంత కాలం సన్నిహితంగా ఉన్నారు. యువతి వివాహం విషయం తీసుకురావడతో ఇర్ఫాన్ ముఖం చాటేశాడు.
దీంతో మోసపోయానని నిర్ధారించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో, 2016లో ఇర్ఫాన్ పై మోసం, వంచన వంటి సెక్షన్లపై కేసు నమోదైంది. ఈ కేసు వాయిదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం వారిద్దరూ కోర్టు వాయిదాకు హాజరయ్యారు. అనంతరం 'నీతో మాట్లాడాలి' అంటూ సదరు యువతి వెంట ఆమె ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్, అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.