: నా పై కాల్పులు జరిపింది ఎవరో పోలీసులే తేల్చాలి: విక్రమ్ గౌడ్
తనపై కాల్పులు జరిపింది ఎవరో పోలీసులే తేల్చాలని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాల్పులు జరిపించుకునే దౌర్భాగ్యం తనకు పట్టలేదని, అప్పుల్లో ఉన్న నేను రూ.50 లక్షలు ఇచ్చి ఎలా కాల్పులు జరిపించుకుంటానని ప్రశ్నించారు. సానుభూతి కోసమే కాల్పులు జరిపించుకున్నానని పోలీసులు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ తనపై పోలీసులకు పాత కోపం ఉందని ఆరోపించారు.
తానేమీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, అయితే, తన తండ్రికి రాజకీయ వారసుడిని తానేనని చెప్పారు. డ్రగ్స్ తో తనకు సంబంధం లేదని, డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన వారిలో తన స్నేహితులు ఉన్నారని చెప్పారు. ఒడిశాలో తాను మైనింగ్ వ్యాపారం చేశానని, అక్కడ కొందరితో గొడవలు ఉన్నాయని, ఈ విషయం తెలిసిన ఒడిశా ఇంటెలిజెన్స్ పోలీసులే తనకు వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారని చెప్పాడు. తనపై జరిగిన కాల్పుల కేసుకు సంబంధించి నందు అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తానే చెప్పానని, ఈ కేసును కోర్టులో ఎదుర్కొంటానని విక్రమ్ గౌడ్ చెప్పుకొచ్చారు.