: శిల్పా సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకండి.. ఆ సమితి చట్ట విరుద్ధం!: సీఎం చంద్రబాబు
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని, శిల్పా సహకార సమితిలో రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించొద్దని, ఆ సమితి నిర్వహణ చట్టవిరుద్ధమని, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాలలో ఉప ఎన్నిక ప్రచారంలో రెండో రోజు ఆయన పాల్గొన్నారు. స్థానిక ఫంక్షన్ హాల్ లో ముస్లిం మత పెద్దలతో సమావేశం అయ్యారు.
అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని, అరాచకాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదని, పేదల భూములను కాజేసి, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, పేదలకు అండగా ఉండాల్సిందిపోయి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముస్లింలను అన్నివిధాలా ఆదుకున్నది టీడీపీనేనని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా ముస్లింల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులు చేసే వారికి ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. కులం, మతం పేరుతో కుట్రలు పన్నాలని చూస్తే ఊరుకునేది లేదని, ముస్లింలను అన్నిరంగాల్లో అభివృద్దిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, బడ్జెట్ లో ముస్లింలకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. శాసనమండలి చైర్మన్ పదవిని ముస్లింలకే కేటాయిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.