: సినిమాకు తీసుకెళ్లలేదని కాలువలో దూకిన భార్య, ఆ వెంటనే భర్త కూడా... ఇద్దరినీ కాపాడిన కానిస్టేబుల్!
తనను సినిమాకు తీసుకెళ్లలేదన్న కారణంతో భార్య కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఈత రాకున్నా భార్యను కాపాడుకునే ఉద్దేశంతో ఆ వెంటనే దూకేశాడా భర్త. ఈ ఘటన విజయవాడలో జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న వారిద్దరినీ చూసిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఇద్దరినీ రక్షించి హీరోగా నిలిచాడు.
మరిన్ని వివరాల్లోకి వెళితే, వాంబే కాలనీకి చెందిన రాజారెడ్డి (20), తిరుపతమ్మ (19) భార్యాభర్తలు. వారికి ఇటీవలే వివాహం జరిగింది. ఇద్దరూ కలసి బయటకు వచ్చిన వేళ, సినిమాకు తీసుకెళ్లాలని తిరుపతమ్మ కోరగా, రాజారెడ్డి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి చెందిన ఆమె, లెనిన్ సెంటర్ వద్ద ఏలూరు కాల్వలోకి దూకింది. ఆపై రాజారెడ్డి కూడా దూకాడు. ఈతరాని ఇద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోతుంటే చూసిన కానిస్టేబుల్ ధైర్యం చేసి కాలువలోకి దిగి వారిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కానిస్టేబుల్ సాహసానికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించాయి.