: డబ్బులు పంచడంలో టీడీపీ, వైకాపా పోటా పోటీ... ఎన్నికను రద్దు చేయండి: ఎన్నికల పరిశీలకునికి కాంగ్రెస్ ఫిర్యాదు
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నంద్యాలలో మకాం వేసిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్ ను ఈ ఉదయం కలిసిన కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం డబ్బు పంపిణీపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులూ పోటాపోటీగా డబ్బులను పంచుతున్నారని, ఈసీ తరఫున చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. వినతిపత్రాన్ని పై అధికారులకు పంపుతానని ఈ సందర్భంగా హేమాన్ష్ హామీ ఇచ్చారు.