: ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపుచ్చుకోనున్న పన్నీర్ సెల్వం!


తన కీలక డిమాండ్లను నెరవేర్చుకునేలా చూసుకోవడంలో విజయం సాధించిన ఏఐఏడీఎంకే చీలిక వర్గం నేత పన్నీర్ సెల్వం, తొలుత డిమాండ్ చేసినట్టుగా ముఖ్యమంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రి పదవికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న తమిళనాడు రాజకీయాల్లో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు విలీనం దిశగా చర్చోపచర్చలు సాగిస్తున్న వేళ, జైల్లో ఉన్న శశికళ, తన పట్టును నిలుపుకునేందుకు అక్కడి నుంచే తన వర్గం నేతలకు సలహా, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా, శశికళను పార్టీ జనరల్ సెక్రటరీగా తొలగిస్తున్నట్టు ప్రకటించిన తరువాతనే విలీనం విషయమై తుది ప్రకటన చేస్తానని పన్నీర్ సెల్వం స్పష్టం చేసినట్టు సమాచారం. తనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, తన వర్గంలోని ఎమ్మెల్యేలకు కనీసం మూడు నుంచి నాలుగు మంత్రి పదవులను ఆయన డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఓ శుభవార్త చెబుతానని పన్నీర్ సెల్వం స్వయంగా ప్రకటించారు. పళనిస్వామితో చర్చించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని వేశామని, ఈ కమిటీ చర్చలు సాగిస్తుందని ఆయన తెలిపారు. కీలకాంశాల్లో ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత రెండు వర్గాలూ విలీనం అవుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News