: ఆ దాడులన్నీ మా పనే: ఐఎస్ఐఎస్
స్పెయిన్, రష్యాల్లో జరిగిన ఉగ్రదాడులు తమ పనేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు తన టెలిగ్రామ్ ఖాతాలో ఓ ప్రకటన వెలువరిస్తూ, కాలిఫేట్ కు చెందిన జవాన్లు స్పెయిన్ పై యుద్ధం చేయగా, దాదాపు 120 మంది మరణించడం లేదా గాయపడటం జరిగిందని వెల్లడించింది. ఇస్లాంకు వ్యతిరేకంగా మారిన తీర ప్రాంత పట్టణం కాంబ్రిల్స్ పై తమ ఫైటర్స్ విరుచుకుపడ్డారని తెలిపింది.
కాగా, బార్సిలోనాలో పౌరులపైకి ఓ వ్యాన్ ను నడిపించిన ఉగ్రవాదులు 13 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ దాడి తరువాత పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఆపై శనివారం నాడు చేతిలో కత్తితో రష్యాలో విరుచుకుపడ్డ ఓ వ్యక్తి ఏడుగురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచి, ఆపై పౌలీసుల ఎన్ కౌంటర్ లో మరణించాడు. రష్యాలోని సుర్గత్ నగరంలో తమ సోల్జర్ ఈ పని చేసి అమరుడయ్యాడని కూడా ఐఎస్ఐఎస్ ప్రకటించింది.