: ఉత్కల్ రైలు ప్రమాదానికి కారణం అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులు!: రైల్వే అధికారుల అనుమానం!
పూరి-హరిద్వార్ రైలు ప్రమాదం వెనక కారణాన్ని విశ్లేషిస్తున్న అధికారులు అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులే కారణమని అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి వద్ద ఈ రైలు ప్రమాదానికి గురైంది. 14 కోచ్‌లు పట్టాలు తప్పాయి. 23 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికిపైగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి గల కారణాలను రైల్వే విశ్లేషిస్తుండగా సీనియర్ అధికారులు మాత్రం అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ట్రాక్ పనులు జరుగుతున్నాయని డ్రైవర్‌కు తెలియకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘నిర్వహణ విఫలం’ వల్లే ఇది జరిగిందని, ప్రమాద సమయంలో ఉత్తర రైల్వేకి చెందిన సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నట్టు పేర్కొంటున్నారు. నిర్వహణ పనులు చేస్తున్న రైల్వేసిబ్బంది ట్రాక్‌పై ఎర్ర జెండా పెట్టడం కానీ, ఇతరత్రా హెచ్చరిక చర్యలు గానీ తీసుకోలేదని అంటున్నారు. ఆ సమయంలో 10-15 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన రైలు ఏకంగా గంటలకు 106 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.