: మరో హాట్ టాపిక్ దొరికితే నేను రాఘవేంద్ర రావుపై చేసిన వ్యాఖ్యలను మర్చిపోతారు: మీడియాపై తాప్సీ ఆగ్రహం
ఇటీవలే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై పలు వ్యాఖ్యలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన హీరోయిన్ తాప్సీ తాజాగా మీడియాపై విరుచుకుపడింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తాను ఝుమ్మంది నాదం సినిమాలో నటిస్తోన్న సమయంలో ఆయన తన నడుముపై కొబ్బరికాయ విసరడంపైనే దృష్టి పెట్టారని తాప్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇస్తోన్న ఇంటర్వ్యూలో ఆ వ్యాఖ్యలపై పలు ప్రశ్నలు అడిగారు. దీంతో ఆమెకు కోపం వచ్చేసింది.
తన కొత్త సినిమా ‘ఆనందో బ్రహ్మ’ విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోందని, ఆ సినిమాపై మాట్లాడడానికి తాను మీడియా ముందుకు వస్తే తనను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారేంటని తాప్సీ నిలదీసింది. మీడియాలో చాలా మంది తనను ఆ వివాదానికి సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నారని వాపోయింది. తనను ప్రశ్నలు అడిగిన వారిలో చాలా మంది తన తప్పేంలేదని అన్నారని చెప్పుకొచ్చింది. అయితే, మీడియాలో తనని సపోర్ట్ చేస్తూ ఎవ్వరూ ఒక్క ఆర్టికల్ కూడా రాయలేదని చెప్పింది.
ఎవరి టీఆర్పీ రేటింగ్స్ వాళ్లు చూసుకున్నారని తాప్సీ బాధపడిపోయింది. మరొక హాట్ టాపిక్ రాగానే మీడియా వాళ్లు తన విషయం మర్చిపోతారని చురకలంటించింది. అందుకే తాను ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుని వదిలేశానని చెప్పుకొచ్చింది. తాను రాఘవేంద్రరావుపై వ్యాఖ్యలు చేసిన అంశంలో కొందరి సంతృప్తి కోసమే క్షమాపణ చెప్పానని వ్యాఖ్యలు చేసింది.