: బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదుల విషయంలో భారత్‌ను ఇరుకున పెట్టేందుకు చైనా కొత్త చర్యలు
భారత్‌పై విషం చిమ్ముతున్న చైనా ఇప్పుడు మనదేశాన్ని ఇరుకున పెట్టేందుకు మరో వ్యూహాన్ని అమలుచేస్తోంది. చైనా, భారత్‌లకు మధ్య బ్రహ్మపుత్ర, సట్లెజ్ నదుల జల ప్రవాహానికి సంబంధించిన వివరాలను పంచుకోవాలని గత ఏడాది ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు చైనా ఆ నదుల ప్రవాహానికి సంబంధించి ప్రతి ఏడాది భారత్‌కు వివరించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు చైనా ఆ వివరాలని చెప్పాల్సి ఉందని, అయితే, ఇంతవరకు ఆ విషయంపై డ్రాగన్ కంట్రీ స్పందించలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఆ రెండు నదుల వరదల వల్ల అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం ప్రభావితమవుతున్నాయని అన్నారు. చైనా ఆ నదుల ప్రవాహ వివరాలను తెలిపితే, వరదలను తట్టుకునేందుకు ముందే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. గతంలోనూ భారత్‌ని చైనా ఇటువంటి ఇబ్బందే పెట్టాలని చూసింది.
పాక్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ సమీక్షించాలని యోచించినప్పుడు, మనదేశంలోకి ప్రవహిస్తోన్న బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని నిలిపేందుకు డ్రాగన్ కంట్రీ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ ప్రాజెక్టు కట్టిన చైనా, మరో రెండు ప్రాజెక్టులను కూడా కట్టాలని చూస్తోంది. భారత్ చేస్తోన్న వినతులను ఆ దేశం పట్టించుకోవడం లేదు.