: వచ్చేనెల 1న భూమికి దగ్గరగా రానున్న భారీ గ్రహ శకలం
సెప్టెంబర్ 1న 4.4 కిలోమీటర్ల పరిమాణంతో ఉండే ఓ భారీ గ్రహ శకలం భూమికి దగ్గరగా రానుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ భారీ గ్రహ శకలం పేరు ఆస్టరాయిడ్ ఫ్లోరెన్స్ అని, అది భూమికి ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళుతుందని వివరించారు. భూమికి ఇంత దగ్గర నుంచి వెళ్తున్న గ్రహ శకలం ఆస్టరాయిడ్ ఫ్లోరెన్సేనని, తాము పరిశోధనలు ప్రారంభించాక ఇంత దగ్గరగా గ్రహ శకలం వెళుతుండడం ఇదే మొదటిసారని అన్నారు.
ఇటువంటి పరిణామం మళ్లీ 2500లో సంభవిస్తుందని పేర్కొన్నారు. గతంలో 1890లో ఇటువంటి గ్రహ శకలమే భూమికి అతి సమీపంగా వచ్చిందని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు రానుందని చెప్పారు. ఈ గ్రహ శకల ప్రయాణం వివిధ నక్షత్ర మండలాల గుండా ఉంటుందని, దాన్ని టెలిస్కోపు ద్వారా గమనించవచ్చని వివరించారు.