: తీవ్ర భావోద్వేగం...17 ఏళ్ల తరువాత కుమారుడ్ని షార్జాలో కలిసిన భారతీయ కన్న తల్లి... వీడియో చూడండి


మూడేళ్ల వయసులో దూరమైన కొడుకు 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత కన్నతల్లికి కనిపిస్తే?...జీవితంలో ఇంకెవరూ లేరు అనుకున్న బిడ్డకు కన్నతల్లి ఉందని, కలిసేందుకు వస్తుందని తెలిస్తే ఆ భావం ఎలా ఉంటుందో షార్జాలో కలిసిన నూర్జహాన్, హనీ నాడెర్ మెర్గానీ అలీలను అడగాలి. ఎందుకంటే ఇద్దరూ ఆ అనుభూతిని అనుభవిస్తున్నారు. షార్జాలో వైరల్ అయిన వారి కథలోకి వెళ్తే... కేరళలోని కోజికోడ్ కు చెందిన నూర్జహాన్ సూడాన్ నుంచి విద్యాభ్యాసానికి వచ్చిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో మూడేళ్ల వారి కాపురం హాయిగా సాగింది. అయితే ఒక రోజు అకస్మాత్తుగా నూర్జహాన్ కు తన భర్త, మూడేళ్ల కుమారుడు కనిపించలేదు. దీంతో తెలిసినవారు, భర్త ఆఫీసు సిబ్బంది, భర్త స్నేహితులు ఇలా ఎవరిని అడిగినా తెలీదన్న సమాధానమే వినిపించింది.

ఇంతలో తన ఇంట్లోనే ‘స్వదేశానికి వెళ్తున్నా. కొడుకును బాగానే పెంచుతా, మా అమ్మానాన్నలను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. దయచేసి క్షమించు’ అంటూ ఒక లేఖ కనిపించింది. దీంతో ఆమెకు విషయం అర్థమైంది. భర్త చేసిన అన్యాయాన్ని దిగమింగుకుని, మిషన్ కుడుతూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలను కష్టపడి ఉన్నత చదువులు చదివించింది. మరోపక్క సూడాన్ లో తనయుడిని తండ్రి జాగ్రత్తగా పెంచాడు. ఒకరోజు తన కేరళ ప్రయాణం, విద్యాభ్యాసం, ప్రేమ, పెళ్లి, స్వలాభం కోసం భార్యను వదిలేయడంతో సహా అన్నీ చెప్పిన హనీ తండ్రి... తన స్వార్థం కోసం ఆమెను వదిలేశానని, ఇప్పుడెలా ఉందో, ఎక్కడ ఉందో కూడా తెలియదని తల్లి గురించి హనీకి తెలిపాడు.

దీంతో ఇన్నాళ్లూ తల్లిలేదని భావించిన హనీ, ఇప్పుడు తల్లి ఉందని, భారత్ లో ఉందని తెలుసుకుని తన తల్లిని కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. దీంతో దుబాయ్ లోని కరామాలో కిరణా షాప్ లో పని చేస్తూనే సూడాన్, అబుదబీలో ఉండే భారతీయులతో కేరళలోని తన తండ్రి ఉన్న ప్రాంతం, తల్లి పేరును చెప్పి, తన గతం చెప్పి ఎవరైనా ఉన్నారా? అని ఆరాతీయడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తరువాత అతని ఫేస్ బుక్ పోస్టుకు తాను భారత్ లోని కేరళకు చెందిన నూర్జహాన్ కుమార్తె షమీరాని అని పరిచయం చేసుకుంది. మెసేజ్ చూసిన హనీ ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా, ఆమెకి ఫోన్ చేసి, తన చెల్లెలేనని నిర్ధారించుకున్నాడు. మాటల మధ్యలో ఆమె కూడా దుబాయ్ లోనే ఉందని గుర్తించాడు.

 వెంటనే నేరుగా చెల్లెలి వద్దకు వెళ్లిపోయాడు. తల్లిగురించి తెలుసుకున్నాడు. ఫేస్ బుక్ లో చెల్లెలి స్నేహితుల పోస్టులతో ఇది దుబాయ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో దుబాయ్ లోని టీవీఛానెళ్లు వీరి కథను, ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. దీంతో ఇది మరింత వైరల్ అయింది. వీటిని చదివిన ఐన్ అల్ షహీమ్ ట్రేడింగ్ అధినేత తల్హా షాహ్ అనే పాకిస్థాన్ వ్యాపార వేత్త వారి కుటుంబగాథకు చలించిపోయారు. వెంటనే హనీకి ఫోన్ చేసి 'ఉద్యోగం ఇస్తాను రా' అని పిలిచారు. అప్పటికే మరో వ్యాపారవేత్త తనకు ఉద్యోగాన్ని ఇచ్చారని చెప్పగానే...హర్షం వ్యక్తం చేసిన ఆయన...'పోనీ నీ తల్లితో నిన్ను కలిపే అవకాశం నాకు కల్పించు' అనడంతో సరే అన్నాడు.

 అంతే, ఆయన వెంటనే కేరళలో ఉన్న హనీ తల్లి నూర్జహాన్ (40), ఆమె రెండో కుమార్తెను దుబాయ్ తీసుకొచ్చేందుకు విమాన టికెట్లు ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం పది గంటలకు వారు షార్జాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. 17 ఏళ్ల తరువాత కొడుకుని చూసిన ఆనందంతో ఆ తల్లి నోట మాటరాలేదు. తల్లిని చూసి ఆనందంతో కొడుకు వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. కాసేపు ఇద్దరికీ మాటలు రాలేదు. కన్నీళ్లే మాటలాడాయి. వారి ఆత్మీయ కలయికను వందలాది మంది ఆసక్తిగా వీక్షించారు. షార్జాలో టీవీ ఛానెళ్లు లైవ్ ప్రసారం చేశాయి. తన తల్లిని ఉంచేందుకు తన స్నేహితురాలు ఫ్లాట్ ఆఫర్ చేసిందని, ఇన్నేళ్లు దూరమైన తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటానని హనీ మీడియాతో చెప్పాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News