: చంద్రబాబు కాన్వాయ్ కి కారును అడ్డంగా నిలిపిన తుడా ఛైర్మన్
టీడీపీ సీనియర్ నేత, తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్ నరసింహ యాదవ్ తీవ్ర చర్యకు దిగారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ కే తన కారును అడ్డంగా నిలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాల్లోకి వెళ్తే, నిన్న సాయంత్రం విజయవాడ నుంచి తిరుపతికి చంద్రబాబు వచ్చారు. స్థానికంగా ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ లో ఆయన బస చేశారు. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. మిగతావారిని లోపలకు అనుమతించిన భద్రతా సిబ్బంది... నరసింహను మాత్రం అనుమతించలేదు.
దీంతో, ఆయన ఆగ్రహానికి గురయ్యారు. చంద్రబాబుతోనే ఈ విషయాన్ని తేల్చుకుంటానని సెక్యూరిటీపై మండిపడ్డారు. అంతేకాదు, తన కారును తీసుకొచ్చి ముఖ్యమంత్రి కాన్వాయ్ కి అడ్డంగా నిలిపారు. చంద్రబాబు తిరుపతి నుంచి నంద్యాలకు బయల్దేరాల్సిన సమయం ఆసన్నం కావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నరసింహ వాహనాన్ని పక్కకు తొలగించారు.