: ప్రతిరోజూ జాతీయ గీతం... క్రమం తప్పకుండా నిలబడుతున్న ప్రజలు!
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ప్రతిరోజూ ఉదయం 8 గం.లకు ఊరు మొత్తం స్పీకర్లలో జనగణమన వినిపిస్తుంది. జాతీయ గీతం వినపడగానే ఎక్కడి వారు అక్కడే తమ పనులను ఆపేసి, గీతం పూర్తయ్యే వరకు నిల్చునే ఉంటారు. ఆగస్టు 15 నుంచి ఇలా ప్రతిరోజూ జాతీయ గీతాన్ని గౌరవించుకోవాలని ఆ పట్టణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పోలీసులు పట్టణంలోని 16 ప్రాంతాల్లో స్పీకర్లను ఏర్పాటు చేశారు.
జాతీయ గీతం ప్రారంభమవడానికి ఐదు నిమిషాల ముందు ఒక ప్రకటన వస్తుంది. దాంతో ప్రజలంతా సిద్ధమవుతారు. తర్వాత జనగణమన వస్తున్న 52 సెకన్ల పాటు వారు నిల్చునే ఉంటారు. ఇలా ప్రతిరోజూ జరుగుతుంది. ఇదంతా ఆ ప్రాంత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రశాంత్ రెడ్డి వల్లే సాధ్యమైందని పట్టణ వాసులు చెబుతున్నారు. తన ఐడియాకు పోలీసు శాఖతో పాటు పట్టణ వాసులు కూడా మద్దతు పలకడం వల్లే ఇది సాధించగలిగినట్లు ప్రశాంత్ తెలిపారు.