: స్వర్గానికి చిరునామా ఇదే... ఇలా వెళ్లండి!: గుజరాత్ లో సరికొత్త శ్మశానం


గుజరాత్‌ లోని సూరత్‌ మెట్రోపాలిటన్‌ రీజయిన్‌ లోని బర్దోలీ మున్సిపాలిటీ మీదుగా మింధోలా నది ప్రవహిస్తుంది. దాని తీరాన ‘అంతిమ్‌ ఉడాన్‌ మోక్ష ఎయిర్‌ పోర్ట్‌’ ఉంది. ఇది నిజమైన ఎయిర్ పోర్ట్ అనుకోకండి. అదో శ్మశానం. అయితే శ్మశానం అన్న పదం కరుకుగా ఉందని భావించిన దాని నిర్వాహకుడు సోమాభాయ్ పటేల్ మోక్ష ఎయిర్ పోర్ట్ అని పేరుపెట్టారు. అందులోకి వెళ్లగానే ‘స్వర్గ్‌ ఎయిర్‌ లైన్స్‌’, ‘మోక్ష ఎయిర్‌ లైన్స్‌’ అనే రెండు విమాన ప్రతిరూపాలు ఉంటాయి. ఇంతలో ముందు బుక్ చేసుకున్న ప్రకారం ఎయిర్ పోర్టులోని లౌడ్ స్పీకర్ల నుంచి  ‘‘వారు స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైంది.. ఒకటో నంబర్‌ టెర్మినల్‌ గుండా లోపలికి తీసుకురండి..’’ అన్న అనౌన్స్ మెంట్ వినిపిస్తుంది.

 అలా వారు ఏ టెర్మినల్ అని చెబితే దాని గుండా లోనికి తీసుకొస్తారు. అక్కడ ఎలక్ట్రిక్‌ క్రిమిటోరియం ద్వారా శాస్త్రబద్ధంగా తంతు పూర్తిచేస్తారు. ఈ తంతు పూర్తవుతున్నప్పుడు విమానం టేకాఫ్ ధ్వనిని లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపిస్తారు. తన బామ్మ చెప్పిన ‘మరణం.. మనిషి ప్రయాణంలో ఒక మలుపు మాత్రమే. చనిపోయినవాళ్లు దర్జాగా విమానంలో స్వర్గలోకానికి వెళతారు. కాబట్టి ఎవరైనా పోతే అస్సలు ఏడవొద్దు' అంటూ చెప్పిన మాటల స్పూర్తితో నిరుపయోగంగా మారిన ఆ శ్మశానాన్ని సరికొత్త హంగులతో సోమాభాయ్ పటేల్ వినియోగంలోకి తెచ్చారు. మొదట్లో అంత్యక్రియల నిర్వహణకు వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసేవారమని, ఇప్పుడు విరాళాలు విరివిగా వస్తుండంతో వాటిని రద్దు చేసి, ఉచితంగానే అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News