: 'సంజయ్ బయోపిక్ లో నటించేందుకే నేను పుట్టా'నంటున్న బాలీవుడ్ నటుడు!
సంజయ్ దత్ బయోపిక్ లో నటించేందుకే తాను పుట్టానేమోనని బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ అంటున్నాడు. 2015 నుంచి సరైన హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రణ్ బీర్ కు 'యే దిల్ హై ముష్కిల్' పేరు తెచ్చినా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఇక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన 'జగ్గా జాసూస్' సినిమా అయితే బాక్సాఫీసు వద్ద బోల్తా పడి తీవ్రమైన నష్టాలు తెచ్చింది.
ఈ నేపథ్యంలో సంజయ్ దత్ బయోపిక్ లో నటిస్తున్న రణ్ బీర్ కపూర్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అప్పుడే ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్లినా సంజయ్ దత్ బయోపిక్ గరించే మాట్లాడుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు ప్రతిరోజూ సంజయ్ దత్ వస్తున్నాడని చెప్పాడు. ఎలా నటించాలో చెబుతున్నాడని రణ్ బీర్ కపూర్ చెప్పాడు. ఒకరిలా నటించాలంటే శరీరదారుఢ్యాన్ని వారిలా మలచుకుంటే చాలని, కానీ వారిలా మనస్తత్వం మాత్రం రాదని, అయితే తాను మాత్రం మనస్తత్వాన్ని అలవాటు చేసుకునేందుకు చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఈ బయోపిక్ ద్వారా సంజయ్ దత్ అంటే ఏంటో తెలుస్తుందని రణ్ బీర్ కపూర్ తెలిపాడు.