: ఓటీపీ చెప్పింది... రూ. 69వేలు పోగొట్టుకుంది!
`వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఇతరులతో పంచుకోవద్దు` అంటూ బ్యాంకు వారు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయినా చాలా మంది ఆ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోరు. అలాగే ముంబైకి చెందిన మహిళ కూడా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పిన ఓ వ్యక్తితో ఓటీపీ షేర్ చేసుకుంది. దీంతో రూ. 68,982 నష్టపోయింది. విద్యావిహార్ ప్రాంతానికి చెందిన హేమలతా సూర్యవంశీకి గత సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది.
`మేం బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం. మీరు మీ డెబిట్ కార్డును రెన్యూవల్ చేసుకోండి. లేకపోతే నెలాఖరులోగా మీ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. కార్డు వివరాలు చెప్పండి` అని అడిగారు. దీంతో వారు చెప్పింది నిజమే అనుకుని హేమలతా తన కార్డు వివరాలు చెప్పింది. తర్వాత ఓ వ్యక్తి మళ్లీ కాల్ చేసి `మీ ఫోన్‌కి కొన్ని వన్ టైమ్ పాస్‌వర్డ్స్ వస్తాయి. అవి కూడా చెప్పండి` అని అడిగాడు. హేమలత అన్ని ఓటీపీలు చెప్పడంతో రూ. 68,982 అకౌంట్ నుంచి విత్‌డ్రా అయినట్టు ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి విచారించగా వారు డబ్బు విత్‌డ్రా గురించి చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా విద్యావిహార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అప్పుడు బాధితుడు రూ. 25వేలు పోగొట్టుకున్నాడు.