: లోకేష్ అంత ఘటికుడే అయితే ఒక్క రోజు బయటకు రమ్మనండి: బొత్స వ్యంగ్యం
తన కుమారుడు లోకేష్ మంచి నేత, ఘటికుడేనని చంద్రబాబు భావిస్తుంటే, ఆయన్ను ఎందుకు నంద్యాలలో ప్రచారానికి పంపడం లేదని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఒక్క రోజు బయటకు వచ్చి ప్రచారం చేస్తే, లోకేష్ బండారం బయటపడుతుందని ఎద్దేవా చేసిన ఆయన, "బావమరిదిని పంపితే ఏదో చేసి వచ్చాడు, ఇక కొడుకును పంపితే ఇంకేదో చేసి వస్తాడు" అన్న భావనతోనే తన కొడుకును ప్రచారానికి దూరంగా ఉంచాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నిజంగా లోకేష్ యువ నాయకుడే అయితే, ఓటర్ల ముందుకు రాకుండా వెనకెందుకు దాక్కున్నారని ప్రశ్నించారు. 1000 మంది చంద్రబాబులు వచ్చినా, నంద్యాలలో వైకాపా గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు పాపాలు పండాయన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ నంద్యాల ఫలితం తెలియజేస్తుందని చెప్పారు.