: తాను ఆడుకునే పార్కును రక్షించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసిన ఏడేళ్ల బాలిక!
`మేం పార్కులో రోజూ ఆడుకోలేకపోతే... రేపు దేశానికి ఒలింపిక్ పతకం ఎలా తీసుకురాగలం?` అంటూ తన లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీకి చెందిన ఏడేళ్ల నవ్య ప్రశ్నించింది. తన స్నేహితులతో కలిసి తాను రోజూ ఆడుకునే పార్కు స్థలంలో త్వరలో కమ్యూనిటీ హాల్ కట్టబోతున్నారని, ఎలాగైనా పార్కుని కాపాడాలని కోరుతూ ప్రధాని మోదీకి నవ్య రెండు పేజీల లేఖ రాసింది. సెప్టెంబర్ 17న మోదీ పుట్టినరోజు సందర్భంగా తనకు బహుమతిగా పార్కుని రక్షించాలని నవ్య లేఖలో రాసింది.
అలాగే పార్కుతో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఒక పద్యం కూడా రాసింది. అంతేకాకుండా పార్కు బొమ్మను, తన బొమ్మను లేఖలో చక్కగా గీసింది. ఇంకా పార్కు స్థలంలో భవనం నిర్మించడంపై తన తండ్రి లాయర్ ధిరాజ్ సింగ్ సహాయంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా వేసింది. నవ్య వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి నోటీసులు కూడా జారీ చేసింది.