: చైనాతో యుద్ధం వస్తే కనుక ఇండియాకే మద్దతన్న జపాన్!
సిక్కిం - టిబెట్ - భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతమైన డోక్లామ్ లో ఇండియా, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరో అగ్రదేశం భారత్ కు మద్దతుగా నిలిచింది. తాము ఇండియా వెంట ఉంటామని ఇప్పటికే అమెరికా స్పష్టం చేయగా, తాజాగా జపాన్ కూడా ఇండియాకు సపోర్ట్ గా నిలిచింది. డోక్లామ్ ప్రాంతంలో రెండు దేశాల సైనిక దళాలూ సంయమనంతో ఉండాలని, ఒకేసారి వెనక్కు మళ్లి, ఆ ప్రాంతంలో యథాతథ స్థితి కొనసాగించాలని జపాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగి, యుద్ధం సంభవిస్తే మాత్రం తాము ఇండియా పక్షాన నిలుస్తామని జపాన్ దౌత్యాధికారి కెన్జీ హిరామత్సు తెలిపారు. డోక్లామ్ ప్రాంతంలో రహదారిని నిర్మించాలని చైనా నిర్ణయించుకోవడం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. రెండు దేశాలూ సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలు ప్రారంభించాలని సలహా ఇచ్చారు. తమ దేశం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉందని పేర్కొన్న ఆయన, భారత్ పరిస్థితిని తాము అర్థం చేసుకున్నామని తెలిపారు. భూటాన్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఇండియా నడుచుకుంటున్నదని అన్నారు. ఏది ఏమైనా, సరిహద్దుల విషయంలో శాంతి పూర్వక ఒప్పందం సాధ్యమైనంత త్వరగా కుదరడం ఎంతో ముఖ్యమని తెలిపారు.