: తాజ్ మహల్ ని నాశనం చేయాలనుకుంటున్నారా?: కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు
తాజ్ మహల్ ను నాశనం చేయాలనుకుంటున్నారా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర నుంచి ఢిల్లీ వరకూ సరికొత్త రైల్వే మార్గం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్లో భాగంగా వేయనున్న రైల్వే ట్రాక్ కోసం సుమారు 400కి పైగా చెట్లను తొలగించనున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలగనుందని, ఆ ప్రభావం తాజ్ పై పడనుందని, దాని వల్ల ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన అద్భుతమైన కట్టడం తాజ్ మహల్, దాని పరిసర ప్రాంతాలు కాలుష్యం బారినపడి, నాశనమయ్యే ప్రమాదం ఉందని, దానిని పరిరక్షించాలని కోరుతూ పర్యావరణవేత్త మెహతా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని తాజాగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ‘తాజ్ మహల్ ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో ఒకటి. దాన్ని ప్రభుత్వం నాశనం చేయాలనుకుంటోందా? ప్రస్తుతం తాజ్ మహల్ ఎలా ఉందనే దానికి సంబంధించిన ఫొటోలను అసలు చూశారా? ఆన్ లైన్ లో తాజ్ ఫొటోలు చూడండి.. ఎలా ఉందో కనిపిస్తుంది. అదే చేయాలనుకుంటే 'యూనియన్ ఆఫ్ ఇండియా తాజ్ ను నాశనం చేయాలనుకుంటోంది' అని ఓ అఫిడవిట్ లేదా దరఖాస్తును దాఖలు చేయండి’ అంటూ ద్విసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కేసు విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.