: ఉగ్రబీభత్సం... రక్తమోడిన బార్సిలోనా.. పరుగులు తీసిన ప్రజలు!
స్పెయిన్ ప్రధాన పట్టణమైన బార్సిలోనా ఉగ్రదాడితో రక్తమోడింది. నిన్న మొన్నటి వరకు బాంబులు, తుపాకులతో దాడులు చేసే ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. మారణాయుధాలుగా వాహనాలను ఎంచుకుంటున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై వాహనాలతో స్వైరవిహారం చేస్తూ.. జనాలపైకి పోనిస్తూ.. పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటున్నారు. బార్సిలోనాలోని రద్దీగా ఉండే లస్ రంబ్లస్ రహదారిలో ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదులు వ్యాన్ తో జనాలపైకి దూసుకుపోయారు.
దీంతో అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ రహదారి ఆర్తనాదాలు, ఉరుకులు పరుగులతో గందరగోళంగా మారింది. కాగా, ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. తెల్లని వ్యాన్ దూసుకొచ్చిందని, దాని ధాటికి జనాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొని ప్రణాళిక రచించారని, ఒక వ్యక్తి దాడికి పాల్పడగా, రెండో వ్యక్తిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడి తమ వాళ్లే చేశారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.