: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గంగుల ప్రతాప్ రెడ్డి.. తనకు చంద్రబాబు మంచి స్నేహితుడని వ్యాఖ్య!
మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన హార్టికల్చర్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు నాయుడు సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంగుల ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, పార్టీలు వేరైనా తామిద్దరం మంచి స్నేహితులమని అన్నారు.
చంద్రబాబు నాయుడు చేస్తోన్న అభివృద్ధి పనులు తనను ఆకర్షించాయని, ఇటీవలే తాను నంద్యాల సమస్యలపై చంద్రబాబు నాయుడితో చర్చించానని అన్నారు. చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఆ సందర్భంగానే తాను టీడీపీ చేరాలనుకుంటున్నానని చంద్రబాబుకి చెప్పానని, నంద్యాల ప్రాంత అభివృద్ధి కోసం తాము పాటుపడతామని అన్నారు. తనకు అచ్చెన్నాయుడితో పాటు పలువురు టీడీపీ నేతలు మంచి మిత్రులని అన్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సానుకూలంగా స్పందించాలని కోరారు.