: ఎప్పుడూ హైదరాబాదులోనే ఉండే జగన్... ఇప్పుడు కూడా అక్కడే కూర్చోవచ్చు కదా?: టీడీపీ ఎమ్మెల్యే అనిత విసుర్లు
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ గెలుస్తుందనే ధీమా ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ ఇంటింటికీ వెళ్లి ఎందుకు బొట్టు పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ప్రశ్నించారు. ఎప్పుడూ హైదరాబాదులోనే ఉండే జగన్... ఇప్పుడు కూడా అక్కడే కూర్చోవచ్చు కదా? అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాదు తప్ప ఏనాడూ అమరావతికి రాని జగన్... గత 15 రోజులుగా నంద్యాలలోనే మకాం వేశారని విమర్శించారు.
గెలుపు టీడీపీదేనని... అందుకే వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ లాంటి ఒక దొంగ ఏ మొహం పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడుక్కుంటున్నారని ప్రశ్నించారు. ఏదో ఒక రోజు ఏదో ఒక ఇంట్లో మీరు ఏ మొహం పెట్టుకుని ఓటు అడగడానికి వచ్చారని జగన్ ను అడగడం ఖాయమని చెప్పారు.
వైసీపీ తరపున రోజా ప్రచారం చేస్తోందని... టీడీపీ తరపున మీరు వచ్చారా? అనే ప్రశ్నకు బదులుగా... టీడీపీ తరపున ప్రచారం చేయడం తన బాధ్యత అని అనిత చెప్పారు. అఖిలప్రియకు మద్దతుగా ఉండేందుకే తాను వచ్చానని తెలిపారు. రోజాకు సాటి రావాలంటే ఆమెలా నీచమైన భాషను వాడాల్సి ఉంటుందని... సంప్రదాయంగా ఉండేవారు ఎవరూ ఆమెకు సాటిరారని ఎద్దేవా చేశారు. రోజాతో తనకు పోలిక కూడా లేదని అన్నారు. టీడీపీ నేతలు ఎవరూ నీచమైన భాషలో విమర్శలు చేయరని చెప్పారు.